Comedy, Science Fair, Series, Stories

సైన్స్ ఫెయిర్ – Part 6

మంగళవారం తెల్లవారుజాము 4:00 AM

స్కూల్ రెండో రోజు సైన్స్ ఫెయిర్ కోసం ఎదురుచూస్తోంది ఒంటరిగా… 

ఊరు మొత్తం గాఢ నిద్ర లో ఉంది…

సుబ్రహ్మణ్యం కలలో… నిర్మల మేడం ప్రేమ దేవతలా… 

శ్రీధర్ కలలో .. తస్లీమా చిరునవ్వు నవ్వుతూ…. 

కిరణ్ కలలో …సుబ్బలక్ష్మి వికటాట్టహాసం చేస్తూ …కనిపించారు…

పీడకల వచ్చిన వాడిలా … ఉలిక్కిపడి లేచాడు కిరణ్ … 

దాణ వీర శూర కర్ణ సినిమాలో NTR దుర్యోధనుడు లా  తెగ మదనపడిపోతున్నాడు… కిరణ్… 

ఏదోకటి చెయ్యాలి అని నిశ్చయించుకొని…ఎదో ఒక నిర్ణయానికి వచ్చిన వాడిలా, ఇంట్లో ఉన్న నాలుగు ఖాళీ అగ్గిపెట్టలు తీసుకుని… బయటకు బయలుదేరాడు…

ఊరి చివర ఉన్న వరి చేను లోకి వెళ్లి … కష్టపడి కొన్ని పొలానికి పట్టే పురుగులని, కొన్ని మిడతలని వేటాడి…వాటిని ఆ ఖాలీ అగ్గిపెట్టెల్లో బందించి … తన స్కూల్ వైపు బయలుదేరాడు… 

ఇంకా తెల్లవారుజాము చీకటి అలానే ఉండడం తో … ఆ చీకట్లోనే స్కూల్ గేట్ దూకి…చిన్నగా నక్కి నక్కి నడుచుకుంటూ తమ స్టాల్స్ ఉన్న తరగతి వద్దకు వెళ్లి …ఆ అగ్గిపెట్టెలు తెరిచి ఆ పురుగులని కిటికీల లోంచి ఆ గదిలోకి వదిలేశాడు… 

ఆ తరగతి గది లో…ఆ పురుగులకి కావల్సిన పత్రహరితం ఉన్నది ఒక్క సుబ్బలక్ష్మి , తస్లీమా స్టాల్ లోనే… మిగిలిన అందరివి ప్లాస్టిక్ పరికరాలు…

తిరిగి అదే గెట్ ను ఎక్కి .. స్కూల్ నుంచి బయటపడి .. తన ఇంటికి చేరుకొని తన మిగతా నిద్ర కొనసాగించాడు…  

ఉదయం 9:00 PM…

అందరూ ఒక్కొక్కరుగా  చేరుకుంటున్నారు తమ స్టాల్స్ దగ్గరికి…

కిరణ్ , శ్రీధర్ కూడా చేరుకున్నారు… 

కిరణ్ దూరం నుంచి పక్కన ఉన్న స్టాల్ ని గమనిస్తున్నాడు … తనకి ఆ వరి మొక్కల్లో ఎలాంటి పురుగు పుట్రా ఆనవాళ్ళు కనిపించలేదు … 

“ఛా… నా ప్లాన్ పనిచెయ్యలేదే..” అని నొచ్చుకున్నాడు కిరణ్ …   

శ్రీధర్ ముందు రోజు జరిగిన పరాభవం ని తలుచుకుని ఇంకా మదనపడుతున్నాడు…

అంతలో…సుబ్రహ్మణ్యం వచ్చి … “నిన్న జరిగిన దాని గురించి బాధపడకుండా దానిని మర్చిపోండి…ఈ రోజు చాలా కీలకం.. నిన్న రావలిసిన ప్రభుత్వ ఇంజనీర్స్ కూడా ఈ రోజు  MLA, కలెక్టర్ గారితో కలిసి వస్తున్నారు…మనం మన ప్రెసెంటేషన్ తో కాన్వెంట్ స్కూల్స్ కి ఏమాత్రం తీసిపోము అని నిరూపించాలి …” అని చెప్తూ… పక్క స్టాల్ లో ఎవరినో కళ్లతో  వెతుకుతున్నాడు తెలుగు పాఠం చెప్పడానికి… 

“సరే..” అంటూ తల ఊపారు శ్రీధర్ , కిరణ్ .. తమ దగ్గర వేరే సమాధానం లేక … 

అలా మాట్లాడుతూనే  అటుపక్కగా …స్కూల్ ఆవరణ లో నిర్మల మేడం నడుస్తుండడం గమనించి … అటు పక్కకి అయస్కాంతం ఆకర్షించినట్టు వెళ్ళిపోయాడు సుబ్రహ్మణ్యం… 

సుబ్బలక్ష్మి ఈ రోజు కూడా తన 36 వెక్కిరింత 36 సార్లు పాడేసింది తనకు ఏమి తోచనప్పుడల్లా ….  

కిక్కురుమనలేదు కిరణ్… 

అంతలో…ఆ వరి మొక్కల్లో ఏదో పాకుతున్నట్టు కనిపించింది… 

పెద్ద కేక పెట్టింది సుబ్బలక్ష్మి …ఆ పాకుడు పురుగు ని చూసి …  

ఆ అరుపుకి … రెండు మిడతలు …ఆ వారి మొక్కల్లో నుంచి హెలికాఫ్టర్ లేచినట్టు లేచి …సుబ్బలక్ష్మి తలపైన,  తస్లీమా చెంపల పైన వాలాయి … 

తస్లీమా నెమ్మదిగానే వదిలించుకుంటున్నా… సుబ్బలక్ష్మి చిందులు తొక్కుతూ గోల గోల చేస్తుంది … 

ఆ గది కూడా సుబ్బలక్ష్మి అరుపులకి రీసౌండ్ ఎఫెక్ట్స్ ఇస్తూ బాగా సందడి చేస్తుంది… 

సుబ్బలక్ష్మి చిందులు తొక్కుతూనే అప్రయత్నం గా తస్లీమా తోసేసి .. బయటికి పరిగెత్తింది … 

సుబ్బలక్ష్మి చిందులు చూడాలనే ఉత్సాహం లో కిరణ్ కూడా ఆమె వెంట నవ్వుతూ పరిగెత్తాడు … 

ముఖంలో ఎలాంటి భావం లేకుండా చోద్యం చూస్తున్న శ్రీధర్ పైన …తస్లీమా వచ్చి పడింది  సుబ్బలక్ష్మి తోసిన తోపు వలన … 

శ్రీధర్ , తస్లీమా ఇద్దరు కలిసి వెల్లకిలా కింద పడ్డారు…శ్రీధర్ పైన తస్లీమా పడి ఉంది… తస్లీమా బుగ్గ పైన ఇంకా ఆ మిడత అంటిపెట్టుకోనుంది … 

ఆ క్షణంలో హఠాత్తుగా … ఎక్కడి నుంచి వచ్చిందో ఒక బోదురు కప్ప చటుక్కున ఎగిరి వాలింది కింద పడి ఉన్న తస్లీమా పైన కొంచెం మెడకి దెగర్లో … మరు క్షణం లో ఆ కప్ప నోరు తెరిచి … నాలుక బారుగా చాపి…తస్లీమా బుగ్గపైన అంటిపెట్టుకున్న మిడతని లాగి మింగేసి … చివరగా థాంక్స్ అన్నట్లు “బేక్ బేక్ …” అనేసి గెంతుకుంటూ వెళ్ళిపోయింది … 

ఒక్కసారిగా చుట్టూ ఉన్న పిల్లలు గొల్లుమని పెద్దగా నవ్వారు … 

లేచి నిలబడ్డారు తస్లీమా శ్రీధర్ … 

తస్లీమా కంటినిండా నీళ్లు పెల్లుబికాయి…అలా నిదానంగానే నడుచుకుంటూ , కళ్లు తుడుచుకుంటూ బయటకు వెళ్ళిపోయింది …  

శ్రీధర్ కి ఒక్కసారిగా తస్లీమా పట్ల జాలి, నవ్విన వాళ్ల మీద కోపం ఒకేసారి కలిగాయి … తస్లీమా వెళ్లిన వైపు అతను కూడా బయలుదేరాడు … 

మరోపక్క …సుబ్బలక్ష్మి ని తల పైన పడిన మిడత ఎగిరిపోయింది, కానీ తాను దానినే తలుచుకుని తలుచుకుని భయపడుతూ ఏడుస్తుంది… 

ఆ ఏడుపు చూసి… అప్పటి వరకు నవ్వుకున్న కిరణ్ మనసు ఒక్కసారిగా చివుక్కుమంది … తాను ఎంత పెద్ద తప్పు చేసానో అని తనని తాను నిందించుకున్నాడు …

దెగ్గరికి వెళ్లి …సారీ చెపుదాం అనుకుని … ఇప్పుడు సారీ చెప్పడం వల్ల తానే చేసాడని ఒప్పుకుంటే … గొడవ పెద్దదవుతుంది కానీ తగ్గదు అని గ్రహించి .. మనసులో దేవుడిని క్షమించమని కోరుకున్నాడు … 

ఒక గ్లాసుతో నీళ్లు తీసుకుని వెళ్లి సుబ్బలక్ష్మి కి అందించి తనకి తెలిసిన సినిమా కామెడీ డైలోగ్స్ లాంటివి చెప్తూ తనని నవ్వించడానికి ప్రయత్నించాడు …

సుబ్బలక్ష్మి కూడా …ఎలాంటి వెక్కిరింతలకి పోకుండా … కిరణ్ తో ఫ్రెండ్లీ గా మాట్లాడి… కొంత కుదుటపడింది … 

ఇద్దరు కలిసి కబుర్లు చెప్పుకుంటూ తమ స్టాల్స్ వద్దకి వెళ్లారు … 

స్టాల్ల్స్ దగ్గర  శ్రీధర్, తస్లీమా కనిపించలేదు…

కిరణ్ పక్కన ఉన్న కిటికీ లోంచి చూస్తూ…సుబ్బ లక్ష్మి ని పిలిచి చూపిస్తూ .. 

“అదిగో అక్కడ చూడు… ఆ చెట్టు కింద కొంత దూరం లో సుబ్రహ్మణ్యం మాస్టర్ , నిర్మల్ మేడం… తెలుగు పాఠం చెప్పుకుంటున్నారు …” అన్నాడు … 

ఇద్దరు నవ్వుకుని … తమ తమ స్టాల్స్ లో చేరి కబుర్లలో మునిగిపోయారు…  

Tagged , ,