Comedy, Science Fair, Series, Stories

సైన్స్ ఫెయిర్ – Part 1

గురువారం ఉదయం 11:30

Z.P Boys High school…

సైన్స్ టీచర్ సుబ్రమణ్యం బోర్డు పైన ఎదో ఐన్‌స్టీన్ E=mc2 సాపేక్ష సిద్ధాంతం అంటూ తన ధోరణి లో ఎదో చెప్పుకుంటూ పోతున్నాడు… 

స్కూల్ అటెండెంట్ ఎదో పేపర్ పట్టుకుని 10వ తరగతి A సెక్షన్ గుమ్మం దెగ్గర నిలుచున్నాడు … 

అంతలో “సారు…” అంటూ కేకవేసాడు ఆ అటెండెంట్ .. 

“ఓహ్ సర్కులర్ ఆ..” అంటూ…అది తీసుకుని పైనుంచి కిందవరకూ చదివేసి….పిల్లల వైపుతిరిగి…

“చూడండి…మన స్కూల్ లో…వచ్చేవారం డిస్ట్రిక్ట్ లెవెల్ సైన్స్ ఫెయిర్ ఎగ్హిబిషన్…

డిస్ట్రిక్ట్  లో ఉన్న అన్ని ఊర్ల నుంచు వేరే స్కూల్ పిల్లలు కూడా వస్తారు..

అందుకని… సోమవారం, మంగళవారం మీకు స్కూల్ లేదు…”

పిల్లల మొహాల్లో ఆనందం ఒక మెరుపులా మెరిసింది … 

“ఇంకొక విషయం…మన స్కూల్ నుంచి కూడా.. ఈ సైన్స్ ఫెయిర్ కి పార్టిసిపేట్ చెయ్యాలి … ఎవరికి ఆసక్తి ఉందొ వాళ్ళు చేతులు ఎత్తండి … ఇద్దరు కావాలి”

ఒక్క చెయ్యి కూడా పైకి లేవలేదు… 

ఆ టీచర్ … ముందు బెంచీలో ఉన్న శ్రీధర్ వైపు అలానే చూస్తున్నాడు … ఇంకా తప్పదు అన్నట్టు శ్రీధర్ చెయ్యత్తాడు.. 

“శ్రీధర్ .. నీకు జత గా ఎవరు కావాలో వాళ్ళ పేరు నువ్వే చెప్పు … “

శ్రీధర్ .. వెనక్కి తిరిగి ఎవరి పేరు చెప్దామా అని అందరి ముఖాలు చూస్తున్నాడు … 

పిల్లలంతా … నన్నొదిలే మహాప్రభో … అన్నట్లు దిక్కులు చూస్తున్నారు … 

ఓక నిర్ణయానికి వచ్చినోడిలా … “కిరణ్” సర్ అన్నాడు … 

“వాడు తప్ప ఇంకెవరు దొరకలేదా..” అంటూ టీచర్ .. “అరె కిరణ్ లోపలికి రా ..” అని ఒక కేక వేసాడు .. 

అప్పటివరకు … గది బయట మోకాళ్ళ పైన నిల్చుని … చిరంజీవి సినిమాలో సీన్స్ ని నెమరేసుకుంటూ ఉన్న..కిరణ్ ఒక్క సారిగా ఉలిక్కిపడి…లోపలికి వచ్చి… “yes సార్” అన్నాడు…

శ్రీధరూ, నువ్వు..వచ్చే వారం సైన్స్ ఫెయిర్ ఎక్సిబిషన్ లో పాల్గొంటున్నారు … మీరిద్దరూ ఈ రోజు స్కూల్ అయిపోయాక ఇక్కడే ఉండండి … నేను మీకు ఏమి చెయ్యాలో చెప్తాను … వచ్చే సోమవారం , మంగళవారం స్కూల్ కి సెలవు…కానీ మీ ఇద్దరు స్కూల్ కి రావాలి”

అని..ఆ సర్కులర్ పేపర్ లో…వీళ్ళ ఇద్దరి పేర్లు రాసేసి అటెండర్ ని పంపించేశాడు…

అంతలో hour bell కూడా మోగడం తో… “సాయంత్రం కలుద్దాం” అని వెళ్ళిపోయాడు..

కిరణ్ అప్పుడే తేరుకుని శ్రీధర్ వైపు చూస్తూ…

“ఛీ వెధవ…అంత మంది ఉండగా…నా పేరే ఎందుకు చెప్పావు రా…”

“నువ్వు నా ఫ్రెండ్ కదా అని చెప్పారా…”

“నీ తలకాయ్…రేపు చిరంజీవి మాస్టర్ సినిమా రిలీజ్..నేను రేపు స్కూల్ ఎగొట్టి వెళదాం అనుకున్న…చెడగొట్టావ్.. దానికితోడు …అందరికి మూడురోజులు శెలవు…మనకి తప్ప…అంతా నీవల్లే…

ఆ సుబ్రహ్మణ్యం సార్ కి…పెళ్లి అయి ఉన్నా బాగుణ్ణు..ఇలా సాయంత్రం ప్రాజెక్టులు అంటూ మన ప్రాణం తీయకుండా…”

“అది కాదురా …”

“ఛీ నోర్ముయ్…రెండు రోజుల క్రితమే .. కడుపు నొప్పి అని స్కూల్ కి ఎగనామం పెట్టా… ఇప్పుడు ఆ అవకాశం కూడా లేదు. ఇంకోసారి కడుపు నొప్పి అంటే నా అయ్య .. మక్కెలు ఇరగొడతాడు …”

“అది  కాదురా .. నీకు తెలుసు కదా నాకు కొంచెం బిడియం అని … నువ్వు ఉంటే కొంచెం ధైర్యం గా ఉంటుందని… అందులోను చాలా మంది వస్తున్నారు అని చెప్పారు ..”

“అరేయ్ శ్రీధర్ … అసలు ఆ ఎక్సిబిషన్ ఏంటి? అక్కడ ఏమి చేస్తారో కూడా నాకు తెలియకుండా … నేనయినా ఏమిచేస్తాను … అక్కడ కొంపతీసి ఎవరన్నా నీకు సైన్స్ లో మార్కులు ఎంత అని అడిగితే.. నా పరిస్థితి ఏంటి…”

“అలా ఏమి ఉండదు లేరా కిరణ్ …”

“నీకేం .. అలానే చెప్తావ్.. ఫస్ట్ ర్యాంకర్ వి కాబట్టి..”

అంతలో.. లెక్కల మాస్టారు క్లాసులోకి అడుగుపెట్టాడు… ఎక్కడి వాళ్ళు అక్కడ… వాళ్ళ స్కూల్ బల్లల దెగ్గరికి వచ్చి కూర్చున్నారు … 


Tagged ,