Memories

హిస్టరీ మాస్టర్

జీవితం లో మనం ఎంతో మందిని చూస్తాం… కొంత మందిని గుర్తుపెట్టుకుంటాం..కొంత మందిని…ఆ మనుషుల మనస్తత్వం బట్టి ఎంత వీలైతే అంత తొందరగా మరిచిపోతాం… 

మరిచిపోయిన వాళ్ల గురుంచి ఎలాంటి చింతా లేదు ఎందుకంటే వాళ్ళు మన జీవితంపైన ఎలాంటి ప్రభావం చూపించలేదు… కానీ మనం గుర్తుపెట్టుకున్న ఆ కొంత మందికి మనం ఎంతో కొంత గౌరవం,గుర్తింపు ఇస్తున్నాం అనేగా…!!

ఇలా నా జీవితం లో గుర్తుపెట్టుకున్న కొంత మందిలో ఒకరు మా హిస్టరీ మాస్టర్ వెంకట్రావు.. 

అది నేను తెలుగు మీడియం లో 10వ తరగతి చదువుతున్న రోజులు… 

చదవడం ఒక పెద్ద బాధ్యత లా భావించి … అది బుర్రకి ఎక్కినా ఎక్కకపోయిన బట్టి కొట్టేసి కాలం వెళ్లబుచ్చుతున్న రోజులు … 

ప్రతి సబ్జెక్టు ఒక పజిల్…ఇది ఇలానే ఎందుకుంది? ఇంకోలా ఎందుకు లేదు? అని ప్రశ్నలు అడిగితే మొట్టికాయలు వేసే మాస్టర్లు … గణితం లో సూత్రాలు బట్టి పట్టడం… తెలుగులో సమాసాల తో కుస్తీ …ఇంగ్లీష్ లో గ్రామర్ గోల …ఇంక సైన్స్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు…పీడనం, అయస్కాంతం, సజాతి విజాతి ధ్రువాలు, లఘు దర్పణం, దీర్ఘ దర్పణం లాంటి వాడుకభాష లో లేని, అర్ధం కానీ పదాల గోల…

చివరగా సోషల్ (సాంఘీక శాస్త్రం)…ఇది ఏమి సైన్స్ కి తీసిపోలేదు …శీతోష్ణమండలం, ఉదక మండలం, ఏ యుద్ధం ఎప్పుడు జరిగింది, ఏ రాజు ఎంత కప్పం కట్టించుకున్నాడు లాంటి విషయాలతో నిండిపోయింది … 

దానిని అప్పటివరకూ ఉన్న మాస్టర్లు … ఇది ఇంతే … ఇలానే ఉంటుంది … ఇలానే పరీక్షల్లో రాస్తే మార్కులు పడతాయి అని చెప్పే బాపతు … 

అలా కాలం గడుపుతున్న ఆ 10వ తరగతి రోజుల్లో…అప్పటివరకు ఉన్న సోషల్ మాస్టర్ మానివేయడం తో … కొత్తగా వచ్చాడు మా వెంకట్రావు మాస్టర్… 

కొంచెం పొట్టి … అప్పుడప్పుడే వస్తున్న బట్టతల … ఇస్త్రీ చేసిన షర్ట్, ప్యాంటూ  జేబులో ఒక పెన్ను … జేబు పైన చిన్న సుత్తి కొడవలి బ్యాడ్జి..

చేతిలో…గుండ్రంగా గొట్టంలా చుట్టేసిన ఒక తెలుగు పుస్తకం…(అది మా తరగతికి సంబంధించిన పుస్తకం అయితే కాదు …)

అదే ఆహార్యం… నా 10 వ తరగతి చదువు అయిపోయేంత వరకు… 

వెంకట్రావు మాస్టర్ …మిగతా అందరి మాస్టర్స్ లాగ కాదు… టెక్స్ట్ బుక్  లో ఉన్నది ఉన్నట్టు బిగ్గరగా చదువుకుంటూ పోయే రకం కాదు …ఎప్పుడు క్లాసుకి వచ్చినా మా దగ్గరే టెక్స్ట్ బుక్ తీసుకుని … ఇండెక్స్ పేజీ చూసుకుని… ఆ రోజేం చెప్పాలో ఆ పాఠం మొదలుపెట్టేవాడు … 

అది కూడా బ్లాక్ బోర్డు దగ్గర చెప్పేవాడు కాదు …తన కూర్చిని తరగతి మధ్యలోకి తీసుకొచ్చి కూర్చుని…మా అందరిని తన చుట్టూ గుమికూడేలా చేసి …పాఠం మొదలు పెట్టే వాడు.. 

తన కున్న ఒక మానేరిజం… రెండు చేతులు పిడికిలి బిగించి చూపుడు వేలు మధ్య వేళ్ళని మాత్రమే తెరిచి…హావభావాలతో చేతులు ఊపుతూ పాఠం చెప్పడం.. 

అది పాఠం లా చెప్పకుండా …ఒక కథలా చెప్పేవాడు … 

ఆలా చెప్పిన వాటిలో చాలా ఉన్నాయి…పారిశ్రామిక విప్లవం, ఇంగ్లీష్ రెవల్యూషన్, ఫ్రెంచ్ రెవల్యూషన్, రష్యన్ రెవల్యూషన్, మొదటి ప్రపంచ యుద్ధం… 

ఆ మొదటి ప్రపంచ యుద్ధం పాఠం చెప్పిన విధానం…ఇప్పటికి పాతిక ఏండ్లు అయినా…ఇప్పటికి గుర్తుంది నాకు…

సిలబస్ లో ఉన్న పాఠాలే కాక…చరిత్రలో జరిగిన ఎన్నో విషయాలు కథలు పిట్టకథలు గా చెప్పేవాడు … 

వెంకట్రావు మాస్టర్..వచ్చినప్పటి నుండి.. సోషల్ క్లాస్ అంటే అందులోను హిస్టరీ పాఠం అంటే ఒక సినిమా చూసే దానికన్నా ఎక్కువ  ఉత్సాహం ఇచ్చేవి…

కొన్ని రోజులు గడిచాక…

మా ఇల్లు కొత్తగా కట్టబడుతున్న చోటికి ఒక నాలుగిళ్లు అవతలి  వెంకట్రావు మాస్టర్ కుటుంబం అద్దెకి ఉంటున్నారు అని తెలిసింది… 

కొత్తగా కట్టే మా ఇంటి సిమెంట్ స్తంబాలకి రోజు నీళ్లు పట్టడం, అలాగే ఇంటి ముందు పోసిన ఇసుకా ఇటుక ని కూడా చెల్లాచెదురు కానివ్వకుండా వాటి పైన పాత బస్తాలు పరచడం నా పని…

ఒక రోజు… ఇంటి ముందు..సిమెంట్ స్తంబాలకి నీళ్లు పడుతుండగా.. ఇద్దరు పిల్లలు అన్నాచెల్లెళ్ళు  ఇంటి ముందు ఉన్న ఇసుకలో ఆడుతున్నారు … 

వాళ్ల వయస్సు ఆరు ఏడు సంవత్సరాల కంటే ఎక్కువ ఉండదు… 

ముందు..ఇసుకలో ఆడవద్దని మందలించాను…తర్వాతా వాళ్ళ వివరాలు అడిగితే అప్పుడు తెలిసింది వాళ్ళు వెంకట్రావు మాస్టర్ పిల్లలని…

ఆ రోజు నుంచి వాళ్ళని పెద్దగా ఏమి అనకుండా ఆడుకోమని అనేవాడిని… 

ఒక రోజు ఎర్రటి ఎండ మిట్ట మధ్యాహ్నం లో ఆ పిల్లలు ఆడుకోవడం చూసాను … 

దెగ్గరికి వెళ్ళి … “ఇంత ఎండలో ఆటలేంట్రా…ఇంటికి వెళ్ళండి”…అని మందలించాను…

దానికి ఆ పిల్లలు…నాన్న పిన్ని గొడవ పడుతున్నారు…ఇంటికి కాసపే ఆగి వెళతాం అని చెప్పారు… 

“పిన్ని …?” … మరి “మీ అమ్మ …?” అని అడిగాను… 

“మా అమ్మ చనిపోయింది … మా నాన్న ఇంకో పెళ్లి చేసుకున్నాడు…” అని బదులిచ్చారు ఆ పిల్లలు… 

“ఏమైనా తిన్నారా …?” అని అడిగాను … 

దానికి లేదు అన్నట్టు తల ఊపారు… 

పక్కన ఉన్న షాప్ లో రెండు biscuit ప్యాకెట్ల కొనిచ్చి నా దారిన నేను వెళ్ళిపోయాను…అంతకన్నా నేను చేయగలిగింది ఏమీ లేక… 

కొన్ని నెలలు గడిచాక…10వ తరగతి పరీక్షలు అయిపోయాయి…వెంకట్రావు మాస్టర్ కి గవర్నమెంట్ కాలేజీలో లెక్చరర్ గా జాబ్ వచ్చి ఆయనా వెళ్ళిపోయాడు .. 

ఇంటర్ లో HEC గ్రూప్ లో జాయిన్ అవ్వాలని అనుకున్నా…కానీ ఇంట్లోవాళ్ళ ప్రోద్బలంతో MPC తీసుకుని పక్క ఊరు పారాయణ లో జాయిన్ అయ్యాను … 

మరికొన్ని నెలలు గడిచాక ఒక రోజు…పారాయణ నుంచి సెలవులకి ఇంటికి వెళితే… నా 10వ  తరగతి స్నేహితుడు కనిపించి చెప్పాడు … 

వెంకట్రావు మాస్టర్ ఉరి వేసుకుని చనిపోయాడు అని…వాళ్ళ కుటుంబం అక్కడి నుంచి వెళ్లిపోయారని…

ఆ రోజు నాకు అర్థం అయిన పాఠం…ప్రతి మనిషికి బలాలు ఉన్నట్టే బలహీనతలు ఉంటాయి అని… పాతిక సంవత్సరాల తర్వాత కూడా … నీకు నచ్చిన టీచర్ ఎవరూ? అంటే…నాకు ఠక్కున గుర్తు వచ్చే వ్యక్తి వెంకట్రావు మాస్టర్… ఎందరో పిల్లలకి చదువు చెప్పి వారి వ్యక్తిత్వ వికాసాన్ని పెంచిన గురువు…అలా కుటుంబంలో శాంతి లేక చనిపోవడం మనస్సుని కదిలించివేసింది… 

మనకెంత జ్ఞానం ఉన్నా…మనఃశాంతి కంటే ఏది ముఖ్యం కాదు… 

— సమాప్తం —