Comedy, Science Fair, Series, Stories

సైన్స్ ఫెయిర్ – Part 7

ఒంటరిగా స్కూల్ ఆవరణ లో ఉన్న బెంచ్ పైన కూర్చొని ఉంది తస్లీమా…

అప్పుడప్పుడే కొంత కోలుకొని సాధారణ స్థితికి వస్తుంది…

ఇంతలో..ఆమె వెనుకగా వచ్చి నిలబడ్డాడు శ్రీధర్ … 

కొంచెం వణుకుతున్న స్వరం తో …తస్లీమా అని పిలిచాడు అస్పష్టంగా…అ పిలుపు తస్లీమా చెవుల వరకు చేరలేదు … 

మల్లి కొంచెం స్వరం పెంచి .. తస్లీమా అని పిలిచాడు…

వెనక్కి తిరిగి చూసింది శ్రీధర్ ని…

ఆమె కంట్లో నీళ్లు లేకపోవడంతో కొంత హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నాడు… 

తస్లీమా ఆ బెంచ్ పైన కొంచెం పక్కకి జరిగి, శ్రీధర్ ని వచ్చి కూర్చోమని చెప్తున్నట్టు బెంచ్ పైన తడుతూ .. సైగ చేసింది. 

అసలే ఆ బెంచ్ చాలా చిన్నదిగా ఉండడం తో …శ్రీధర్ నెమ్మదిగా గా వెళ్లి బెంచు అంచున అది కూడా సగం సగం గా కూర్చున్నాడు … 

“పడిపోతావు శ్రీధర్ … కొంచెం లోపలికి జరిగి సరిగ్గా కూర్చో…భయపడకు… ” అని హెచ్చరించింది తస్లిమా… 

సరే అన్నట్టు… కొంచెం లోపలికి జరిగి కూర్చున్నాడు … భుజం భుజం రాసుకుంటూ కూర్చున్నారు..  

తనంత వయస్సు ఉన్న ఒక అమ్మాయికి దగ్గరగా పక్కపక్కన అలా కూర్చోవడం అదే మొదటి సారి శ్రీధర్ కు… 

“మీకు ఏమి దెబ్బలు తగలలేదు కదా…ఇందాక కింద పడినప్పుడు…” అని అడిగాడు శ్రీధర్ … 

తస్లీమా చిన్నగా నవ్వి … “లేదు …ఆ కప్పని అంత దగ్గరగా చూసేసరికి కొంచెం భయం వేసింది …అంతే… దానికి తోడు అందరూ నవ్వే సరికి కొంచెం బాధగా అనిపించి కళ్ళలో నీళ్లు తిరిగాయి… ఐనా అది ఒక చిన్న ఆక్సిడెంట్ …దాని గురించి ఎక్కువగా ఆలోచించాలి అని అనుకోవట్లేదు”…

“నిజమే…కొన్ని చేదు విషయాలు అలా మర్చిపోతేనే  మంచిది … కానీ నాకు జరిగిన పరాభవాన్నిఎంత మర్చిపోదామనుకున్నా… ఆ జ్ఞాపకాలు అలా వెంటాడుతూనే ఉన్నాయి…” అన్నాడు శ్రీధర్ … 

“శ్రీధర్…మీరు ఏమి అనుకోనంటే అసలు మీకు నిన్న ఏమైంది? … ఎందుకలా మౌనంగా ఉండిపోయారు ప్రెసెంటేషన్ లో…?”

“ఏమో తెలియదు … అలా అందరూ నన్ను చుట్టుముట్టి నన్నే చూస్తుంటే నాకు నోటి మాట రాలేదు … పైగా … మీ ఇంగ్లీష్ ఉచ్చారణ మీరు ప్రజెంట్ చేసిన విధానం చూసాక … నేను అలా చేయగలనో లేదో అని… నాలో అంతటి  సామర్థ్యం ఉందొ లేదో అనే ఒక తక్కువ భావం కలిగింది …” అన్నాడు శ్రీధర్…

దానికి బదులుగా తస్లిమా … 

“ఎవరి సామర్థ్యం ఎక్కువ కాదు … తక్కువ కాదు. మనం మన జీవితాన్ని, మన సామర్థ్యాన్ని ఇంకొకరితో పోల్చు కోవాల్సిన అవసరం ఎంతమాత్రం లేదు…అలా ఇంకొకరితో మనల్ని మనం పోల్చుకుంటున్నాం అంటే … మనమే మన సామర్ధ్యాన్ని అవమానిస్తున్నాం అని అర్థం…మనకున్న మన జీవితం ఇతరులని మెప్పించడానికి కాదు…మనకూ, మన మనస్సుకు నచ్చేలా మనమేం చేయగలం అని…

మీకు ఉన్న ఈ ఫోబియా కి మూలకారణం మీరు ఇంకొకరిలా ప్రజెంట్ చేయలేకపోతున్నా, ఇంకొకరిలా జీవించలేకపోతున్న అన్న ఆలోచనే మీ మనసులో ఎక్కడో  భయం గా నాటుకుపోవడం… మీరు ఆ భయాన్ని పూర్తిగా వదిలేయండి అది మీలో ఎన్నో మార్పులు తీసుకు రాగలదు. మీ సామర్ధ్యాన్ని మీరే తక్కువ చేసుకోకండి. నేను ఏదైనా చనువుకు మించి ఎక్కువ మాట్లాడి ఉంటే క్షమించండి”…అంది తస్లిమా … 

ఆ మాటలు విన్నాక కొంత ఆలోచనలో పడ్డాడు శ్రీధర్…కొంత ఎదో తేలిక భావం ఏర్పడింది మనసులో…

అంతలో దూరం నుంచి కిరణ్ పిలుస్తున్నాడు … “ఒరేయ్ శ్రీధర్ … సుబ్రమణ్యం సార్ పిలుస్తున్నారు … అని…”

వస్తున్నా అని చెయ్యి ఊపి…తిరిగి తస్లీమా తో మాటలలో పడిపోయాడు…

ఏ క్షణమైనా సార్ పిలుస్తున్నాడు అంటే చటుక్కున భయం తో పరిగెత్తే శ్రీధర్… మొదటిసారి వస్తున్నా అంటూనే తస్లీమాతో కబుర్లలో పడిపోయాడు …తస్లీమా చెప్పిన “మనసుకు నచ్చిన పని చెయ్యి” అనే సిద్ధాంతాన్ని పాటించడం అక్కడినుంచే మొదలుపెట్టాడు …  

క్రమక్రమంగా శ్రీధర్ తన బిడియాన్ని , భయాన్ని మర్చిపోతూ … తస్లిమా తో నవ్వుతూ జోక్స్ వేస్తూ…కొంత సమయం ఆమెతోనే గడిపాడు..

తర్వాత ఇద్దరు కలిసి …నడుచుకుంటూ తమతమ స్టాల్ దగ్గరికి వెళ్లారు..

వాళ్ల రాక కోసమే ఎదురు చూస్తున్నారు కిరణ్ , సుబ్బలక్ష్మి, సుబ్రమణ్యం, నిర్మల…

వీళ్ళు వెళ్లిన 10 నిమిషాలకు , చివరి ఘట్టం మొదలైంది…

స్కూల్ ఆవరణలో కొంత సందడి…ఇద్దరు గన్ మేన్స్ తో MLA, కలెక్టర్ వీళ్ళు ఉన్న తరగతి గది లోకి ప్రవేశించారు…వాళ్లతో పాటు ఇద్దరు గవర్నమెంట్ ఇంజనీర్స్ మరికొంతమంది పత్రికా విలేకరులు కెమెరా పట్టుకుని వచ్చారు…

ముందుగా వాళ్ళు…తస్లీమా, సుబ్బలక్ష్మి ఉన్న స్టాల్ ముందు ఆగారు…

ఎప్పటిలాగానే…తస్లిమా, సుబ్బలక్ష్మి తమ ప్రెసెంటేషన్ తో అబ్బురపరిచారు…అక్కడ ఉన్న ఇంజనీర్స్…కొన్నిప్రశ్నలు అడగగా..కొన్నిటికి మాత్రం కొంతసమాధానం చెప్పి…మిగిలినవాటికి…తెలియదన్నట్లు తమ పద్దతిలో గౌరవంగా చెప్పారు…

వాళ్ళు కొంత మెచ్చుకోలుగా … “గుడ్ జాబ్..” అని చెప్పి… పక్కన ఉన్న శ్రీధర్, కిరణ్ స్టాల్ వద్దకు కదిలారు…

ఫోటోగ్రాఫర్స్ వాళ్ళ ధోరణిలో…ఫ్లాష్ కొడుతూ ఫొటోస్ తీసుకుంటున్నారు…ప్రతి ఫ్రేమ్ లో…MLA కనిపించేలా…

కిరణ్, సుబ్రమణ్యం మనస్సులో ఆందోళన మొదలైంది… 

శ్రీధర్ ప్రశాంతంగా చెప్పడం మొదలుపెట్టాడు… 

“నమస్కారం సార్…నా పేరు శ్రీధర్, నాతో పాటు ఈ ప్రాజెక్ట్ కి పనిచేసిన వారు, నా క్లాసుమేట్ కిరణ్ మరియు మా సైన్స్ మాస్టర్ సుబ్రమణ్యం…ఈ ప్రాజెక్ట్ పేరు ఆటోమేటిక్ ఫ్లడ్ వాటర్ డిస్పోజల్… 

గత సంవత్సరం… మన పక్క జిల్లా ప్రకాశం లో, భారీ వర్షాల  వలన వరద నీరు ఎక్కువగా చేరి రాళ్ళపాడు రిసర్వాయర్ గేట్లు కూలిపోయి ఎంతో ప్రాణనష్టం ఆస్తి నష్టం జరిగిని సంగతి అందరికి తెలిసిందే … 

గేట్లు తెరవటానికి ఒక ఆటోమేటిక్ వ్యవస్థ లేకపోవడం, గాలి వాన తుఫాన్ వంటి సమయాల్లో గేట్లు తెరవడానికి మనుషులు సకాలంలో అక్కడికి చేరుకోలేకపోవడం లాంటి వలెనే ఇలాంటి ప్రమాదాలు ఎక్కువగా జరుగుతుంటాయి … 

అందుకే మనకి ఇలాంటి ఒక ఆటోమేటిక్ వ్యవస్థ ఒకటి ఉండాలి. దాని కోసం మేము ఒక చిన్న నమూనా తయారు చేసాము… 

ఈ టబ్ ఒక వాటర్  రిసర్వాయర్ అనుకుందాం …దీనికి ఒక వైపుగా అమర్చినవి గేట్లు…దానికి కొంచెం పక్కన వున్నది కంట్రోల్ రూమ్ . ఈ కంట్రోల్ రూమ్ లోంచి వేలాడుతూ ఒక గాలితో నిండిన సిలిండర్ ఈ రిసర్వాయర్ నీళ్ల పైన తేలుతూ ఉంటుంది.  ఈ  సిలిండర్ ఎంత ఎత్తు లో తేలుతుందో దాన్ని బట్టి గేట్లు ఆటోమేటిక్ గా తెరుచుకునేలా ఈ నమూనా తయారుచేశాము.. 

ఇది ఎలా వర్క్ అవుతుందో ప్రాక్టికల్ గా చూపిస్తాను …”

అంటూ కిరణ్ వైపు చూసాడు శ్రీధర్ .. 

కిరణ్ ఒక మగ్గు తో నీళ్లు తీసుకుని .. ఆ టబ్ లో పోస్తూ .. వరదనీరు రిసర్వాయర్ లో పెరిగే విధానాన్ని అనుకరించాడు… ఆ నీరు ఒక పరిమితి ని దాటి పెరగగానే … ఒక సైడ్ ఉన్న గేట్లు ఆటోమేటిక్ గా తెరుచుకుని … కొంత నీటిని వదిలేశాక తిరిగి మూతపడ్డాయి … 

దానికి కొనసాగింపుగా శ్రీధర్ … “ఇలాంటి ఆటోమేటిక్ వ్యవస్థలతో సకాలంలో స్పందించి ప్రాణ నష్టం , ఆస్తి నష్టం తగ్గించవచ్చు” అని తాను చెప్పాలనుకున్నది చెప్పి ముగించాడు … 

ఒక్క క్షణమ్ నిశ్శబ్దం తర్వాత … వాళ్లలో ఒక ఇంజనీర్ ముందుకు వచ్చి … 

“మీరు తయారు చేసిన ఈ నమూనా బాగుంది .. కానీ కొన్ని లోపాలు ఉన్నాయి…ఇది అన్ని వేళలా పనిచేయదు..మీరు చెప్పినంత సులభం కూడా కాదు… 

కానీ మన సమాజంలో మన చుట్టూ జరిగే కొన్ని విపత్తుల నుంచి దేవుడు రక్షిస్తాడు, దేవుడిపైనే భారం లాంటి ఆలోచనలు కాకుండ మానవులుగా సైన్స్ ని ఉపయోగించి ఎలా ఎదుర్కోగలం అనే ఆలోచన నీకు ఈ చిన్న వయస్సులో రావడం … చాలా అభినందించాల్సిన విషయం…”  అంటూ చప్పట్లు చరిచాడు… 

అతనితో పాటు మిగిలిన వాళ్ళందరూ కరతాళధ్వనులు చేశారు …వారితో పాటు తస్లీమా ,సుబ్బలక్ష్మి ,నిర్మల కూడా చేయి కలిపారు మనస్ఫూర్తిగా …

శ్రీధర్ ని ప్రత్యేకంగా అభినందించింది తస్లీమా …  

సాయంత్రం 6:00 PM..

స్కూల్ గ్రౌండ్ లో సభ జరుగుతుంది … 

కలెక్టర్ గారు, ఇంజనీర్స్ …విద్యార్థులనుద్దేశించి కొన్ని మంచి మాటలు చెప్తూ ప్రసంగించారు … 

ఆ తర్వాత … MLA గారు సభా సందర్భం మరిచి రాజకీయ ప్రసంగాలు చేసి తిరిగి ఆశీనులయ్యారు … 

ఇక బహుమతి ప్రధానం అని వ్యాఖ్యాతగా వ్యవహరించే ఒకతను … ఒక్కొక్క విభాగం లో గెలిచిన వారి పేర్లు చదువుతున్నారు … గెలిచిన వారు స్టేజి మీదకి వెళ్లి… షీల్డ్ సర్టిఫికెట్ MLA చేతుల మీదుగా అందుకుని…ఫొటోలకి ఫోజులు ఇచ్చి వస్తున్నారు … చివరిగా “Agriculture & Water resources” విభాగంలో … సుబ్బలక్ష్మి , తస్లీమా పేర్లు వినిపించాయి…వాళ్లిద్దరూ స్టేజి పైకి వెళ్లి సర్టిఫికెట్ అందుకుని వచ్చారు… 

“ఎరా!! మనకి రాలేదని బాధ గా ఉందా” అన్నాడు సుబ్రమణ్యం శ్రీధర్, కిరణ్ లని ఉద్దేశించి … 

“అల్లరి చిల్లరగా ఉన్న నాకు…చదువుకుంటే ఒక గౌరవం వస్తుందని అర్థమైంది … అది చాలు నాకు” అన్నాడు..కిరణ్   

“నేను నన్ను గెలుచుకున్నాను … నా భయాన్ని బిడియాన్ని గెలిచాను ..అదే నాకు పెద్ద బహుమతి”… అన్నాడు శ్రీధర్ కళ్ళలో ఒక సంతృప్తితో … 

తన స్టూడెంట్స్ లో వచ్చిన మార్పుకి సంతోషపడ్డాడు సుబ్రమణ్యం… 

స్టేజ్ పైన … అన్ని విభాగాల్లో బహుమతి ప్రదానం అయిపోయింది … చివరిగా .. చిన్న అనౌన్స్మెంట్ అంటూ … స్టేజ్ పైకి వచ్చాడు వ్యాఖ్యాతగా వ్యవహరించే వ్యక్తి …  

“శ్రీధర్, కిరణ్…  వీరు చేసిన ప్రాజెక్ట్ పొరపాటున Agriculture & Water resources విభాగం లో ఉంచడం జరిగింది … కానీ వాళ్ళు వుండవలిసినది Distater management విభాగంలో…దురదృష్టవశాత్తు అలాంటి విభాగాన్ని ఈవెంట్ మేనేజర్స్ చేర్చలేదు కనుక.. శ్రీధర్, కిరణ్ లని కూడా స్పెషల్ కేటగిరీ కింద విజేతలుగా ప్రకటిస్తున్నాం… ఈ రోజు గెలిచిన వారందరు వచ్చే నెల హైదరాబాద్ లో జరిగే రాష్ట్రస్థాయి సైన్స్ ఫెయిర్ పోటీలకు పాల్గొనవలసి ఉంటుంది …మిగిలిన వివరాలు మీ స్కూల్స్ కి అందుతాయి”  అని ముగించాడు … 

శ్రీధర్, కిరణ్ ,సుబ్రమణ్యం లకి… గెలిచాం అనే ఆనందం కన్నా … వచ్చే నెలలో మల్లి తస్లీమా, సుబ్బలక్ష్మి , నిర్మల  ని మల్లి కలుస్తారు అనే ఆలోచనే ఇంకా ఆనందాన్ని ఇచ్చింది … 

ఒక్కకోరు గా బస్సులు ఎక్కి వాళ్ళ ప్రాంతాలకి బయలుదేరుతున్నారు … 

తస్లీమా, సుబ్బలక్ష్మి , నిర్మల బస్సు ఎక్కి … కిటికీ లోంచి చెయ్యి ఊపుతున్నారు … 

వాళ్ళకి వీడ్కోలు చెప్తూ … శ్రీధర్, కిరణ్ ,సుబ్రమణ్యం చెయ్యి ఊపారు … 

సమాప్తం 

Tagged , ,