మధ్యాహ్నం 3:00 PM…
అప్పటివరకు ఎవరో పిల్లలు, కొంతమంది స్కూల్ టీచర్స్ వచ్చి చూసి పోతున్నారు తప్పా…వీళ్ళ స్టాల్ల్స్ దెగ్గరికి ఎవరూ వచ్చి .. ఇది ఏమి ప్రాజెక్ట్ ..? ప్రెసెంటేషన్..? అన్న పాపాన పోలేదు …
అందరూ సైన్స్ ఔత్సాహికులు … పక్క గదిలో ఉన్న కంప్యూటర్ జ్యోతిష్యం దగ్గర గుమిగూడి ఉన్నారు…
సైన్స్ ఫెయిర్ లో.. జ్యోతిష్యం ఏంటో అని… నవ్వుకున్నాడు శ్రీధర్…
“అది కూడా సైన్స్ రా… ” అని తన విజ్ఞాన ప్రదర్శన మొదలుపెట్టాడు కిరణ్…
“అక్కడితో ఆపేసేయ్…రా బాబు” అని చేతులు జోడించాడు శ్రీధర్…
తనలో పొంగిపొరలుతున్న …జోతిష్య సైన్స్ ప్రవాహానికి ఆనకట్టలు వేశాడు కిరణ్…కానీ “కొండా సుబ్బలక్ష్మి గారు” అంటూ టీజ్ చేసే పని మటుకు ఆపలేదు…
మరోపక్క… శ్రీధర్ ఓరకంట తో గమనిస్తున్నాడు తస్లిమా ని…
తల్లిదండ్రులకు ఒక్కడే సంతానం అయిన శ్రీధర్, అప్పుడప్పుడే యవ్వనం లో ప్రవేశిస్తున్న వయస్సు. ఇంత కాలం కో-ఎడ్యుకేషన్ లేని బాయ్స్ హై స్కూల్ లో చదవడం వలన, తనకి రెండు అడుగుల దూరంలో అమ్మాయిలు మసలడం అంతనికి కొత్త అనుభూతి లా ఉంది. ప్రత్యేకించి తస్లీమా పట్ల కొంత ఆకర్షితుడు అయ్యాడు.
అంతలో… కొంతమంది జనవిజ్ఞాన వేదిక సభ్యులు ప్రవేశించారు వీళ్ళు ఉన్న తరగతి గది లోకి …
మొదటగా… తస్లీమా, సుబ్బలక్ష్మి ఉన్న స్టాల్స్ దగ్గర ఆగి.. “hi..can you explain your project..” అన్నారు…
ముందుగా వాళ్లిద్దరూ వచ్చిన వాళ్ళని పలకరించి , తమ పేర్లను పరిచయం చేసి…ఆ తర్వాత తడుముకోకుండా, గుక్కతిప్పుకోకుండా ఒక 15 నిమిషాలు…ఒక ఇంగ్లీష్ పద్యం పాడినట్టు పడేసారు…మధ్యమధ్యలో చేతులు తిప్పుతూ హావభావాలు ప్రదర్శిస్తూ వాళ్ళు ప్రెసెంటేషన్ ఇస్తున్న తీరు చాలా చూడ ముచ్చటగా ఉంది చూసే వాళ్ళకి …
పక్కనే ఉండి చూస్తున్నాడు శ్రీధర్…వాళ్ళ ఇంగ్లీష్ ప్రవాహం, వాళ్ళ కాన్ఫిడెన్స్ ను చూసి, తనని తాను తక్కువగా చూసుకున్నాడు. తనలో కొంత సేపటి క్రితం మొదలైన ఆత్మనూన్యతా భావం ఇప్పుడు తార స్థాయికి చేరుకుంది.
“well done” అంటూ ఆ వచ్చిన సభ్యులు ఆ ఇద్దరి అమ్మాయిలని మెచ్చుకుని, నిజమైన వరి చేను పెట్టినందుకు ప్రత్యేకంగా అభినందించారు..
ఆ తర్వాత రెండు అడుగులు ముందుకేసి శ్రీధర్ కిరణ్ ఉన్న స్టాల్ దెగ్గరికి వచ్చి ఆగి… “మీ ప్రాజెక్ట్ ని explain చెయ్యండి…” అని అడిగాడు
శ్రీధర్ గుండె వేగం పెరిగింది…నోట్లోంచి మాట పెగలట్లేదు. తాను చుట్టూ జనాలు మూగి తననే చూస్తుండే సరికి ఒక రకమైన Scoptophobia కి గురి అయ్యాడు. వళ్ళంతా చెమటలు పట్టి భారంగా పీలుస్తున్నాడు గాలిని..
పక్కనుంచి కిరణ్ చిన్నగా “చెప్పారా, మాట్లాడు…” అంటూ చిన్నగా బతిమాలి నట్టు చెప్తున్నాడు..
అందరూ ఎదురుచూస్తున్నారు శ్రీధర్ ఏదో చెప్తాడని…కానీ ఎంతసేపటికీ శ్రీధర్ నోటి నుంచి మాట రాకుండా విగ్రహం రాయి లా బిగుసుకు పోయాడు …
“పోనీ నువ్వు చెప్పు బాబు…” అని కిరణ్ ని అడిగాడు ఇంకో సభ్యుడు..
“ఊహించని మలుపుకి…” షాక్ తిన్నాడు కిరణ్…
దిక్కులు చూసాడు సుబ్రమణ్యం మాస్టారు ఎక్కడ ఉన్నాడా అని… కిటికీ లోంచి దూరంగా కనపడ్డాడు చెట్టు కింద సైన్స్ మాస్టర్ సుబ్రమణ్యం తెలుగు పాఠం చెపుతూ నిర్మలా మేడం కి…
ఇక తప్పదన్నట్టు…”ఇది రిజర్వాయర్ … ఇది గేటు…ఇది నీళ్ల పైన తేలాడే ఒక బాల్… ఈ రిజర్వాయర్ లో నీళ్లు పెరిగితే గేట్లు తెరుచుకుంటాయి.. నీళ్లు తగ్గితే గేట్లు మూసుకుంటాయి…” అని కట్టే.. కొట్టే…తెచ్చే తరహాలో తన ప్రెసెంటేషన్ ఇచ్చేసాడు కిరణ్ …
అంతలో వాళ్లలో లో ఉన్న ఒక సభ్యుడు ఒక ప్రశ్న అడిగాడు..దానికి మల్లి ఆవు కథ లాగ…”ఇది రిజర్వాయర్ … ఇది గేటు…ఇది నీళ్ల పైన తేలాడే ఒక బాల్… ఈ రిజర్వాయర్ లో నీళ్లు పెరిగితే గేట్లు తెరుచుకుంటాయి.. నీళ్లు తగ్గితే గేట్లు మూసుకుంటాయి…” అని సమాధానం చెప్పేసాడు … చేసేదేమి లేక …
శ్రీధర్ కొంత తేరుకుంటున్నాడు…కానీ అప్పటికే జరగాల్సిన పరాభవం జరిగిపోతుంది..
ఆ సభ్యులు కొంత నిరుత్సాహంతో కనుబొమలు చిట్లించుకుని… అటుపక్క గా ఉన్న ఇంకో స్టాల్ వైపు అడుగులు వేస్తున్నారు …
“హమ్మయ్య..” అని అనుకున్నాడు కిరణ్…
ఇంతలో ఒక సభ్యుడు మల్లి వెనక్కి తిరిగి… “బాబు మీకు సైన్స్ లో మార్కులు ఎన్ని..?” అని అడిగాడు…
అప్పటికి కొంచెం తేరుకున్న శ్రీధర్ “నాకు 99… వీడికి 36” అని కిరణ్ చూపిస్తూ ఠక్కున జవాబు చెప్పేసాడు అనాలోచితంగా…
ఒక్క సారిగా …పెద్దగా బిగ్గరగా ఒక నవ్వు వినపడింది కిరణ్ చెవిలో … ఆ వెటకారపు నవ్వు సుబ్బలక్ష్మి ది అని గ్రహించడానికి ఎంతో సమయం పట్టలేదు కిరణ్ కి…
తానూ ఏ ప్రమాదం ఐతే జరగకూడదు అనుకున్నాడో … అదే ప్రమాదం తాను ఊహించనంత గోరంగా జరిగిపోయింది …
“ఛీ వెదవ… ఇందాకటి వరకు బెల్లం కొట్టిన రాయి లా ఉన్నోడివి … మార్కులు అనగానే నోరెందుకు తెరిచావ్” … అని కసిరాడు శ్రీధర్ ని … ఒకరి మీద కోపం ఒకరి మీద చూపిస్తూ…
“అయినా నీ మార్కులు నువ్వు చెప్పుకోక .. నా మార్కులు కూడా ఎందుకు చెప్పావు రా… కనీసం అబద్దం చెప్పే సమయం కూడా ఇవ్వలేదు..” అండ్ తన తిట్ల పురాణం ని కొనసాగించాడు కిరణ్…
తస్లీమా ఒక చిన్న నవ్వు నవ్వి ఊరుకుండిపోయింది…సుబ్బలక్ష్మి మాత్రం రెచ్చగొట్టే ధోరణిలో తన నవ్వు ని కొనసాగించింది …
ఉదయం అంత … “కొండా సుబ్బలక్ష్మీ గారు… కొండా సుబ్బలక్ష్మీ గారు…” అని ఆటపట్టించిన కిరణ్ ని తిరిగి .. “36.. 36.. మా ఇంటి నెంబర్ 36… నా రోల్ నెంబర్ 36… మా క్లాసులో స్టూడెంట్ 36…” ఆటపట్టించడం మొదలుపెట్టింది సుబ్బలక్ష్మీ…
ఒక రెండు గంటల తర్వాత..రెండు రోజుల సైన్స్ ఫెయిర్ లో మొదటి రోజు ముగిసింది … ఎవరికి వారు వాళ్ళ స్టాల్స్ ని అలానే వదిలేసి, స్కూల్ ని విడిచి బయటకు నడిచారు …
శ్రీధర్ , కిరణ్ , సుబ్రహ్మణ్యం వాళ్ళ ఇంటికి వాళ్ళు వెళ్లారు…
సిటీ నుంచి వచ్చిన సుబ్బలక్ష్మి , తస్లీమా , నిర్మల… గెస్ట్ హౌస్ కి వెళ్లారు …