అప్పుడే వచ్చిన సుబ్రమణ్యం … “ఎరా !! అంతా సరిగానే ఉందా..” అని అడిగాడు …
“అంతా ఒకే సార్…” అని బదులు ఇచ్చాడు శ్రీధర్…
తనకేమి పట్టనట్టు దిక్కులు చూస్తున్నాడు కిరణ్…
ఒక పెద్ద వెడల్పుగా ఉన్న ప్లాస్టిక్ నీళ్ల టబ్… ఒక పక్క కొంత వరకు కోసేసి … తాము కృత్రిమంగా అమర్చిన ఒక గేట్ ని పెట్టారు , ఒక వాటర్ రిజర్వాయర్ ని తలపించే విధంగా. ఆ గేటు ని ఎత్తడానికి ఒక చిన్న మోటార్ ని పెట్టి, ఆ మోటార్ ని ఆటోమేటిక్ గా కంట్రోల్ చేయడానికి నీళ్లలో, గాలితో నింపిన ఒక చిన్న ప్లాస్టిక్ బాల్ ని ఉంచి, ఆ బాల్ ఆ నీళ్ల టబ్ లో ఎంత ఎత్తులో ఉంటే దానికి అనుగుణంగా గేట్ తెరుచుకునేలా ఒక పరికరాన్ని రూపొందించారు.
ఆ పరికరం డిజైన్ చేయడంలో, సుబ్రహ్మణ్యం కష్టం ఎంత ఉందొ శ్రీధర్ కష్టం కూడా అంతే ఉంది. కిరణ్ కొంత వరకు పెద్దగా మెదడు పెట్టాల్సిన అవసరం లేని పనుల్లో సహాయపడ్డాడు…
అదే సమయంలో అప్పుడే వచ్చిన ఉన్న నిర్మల టీచర్ … “is everything ok?” అని అడిగింది ఆ కాన్వెంట్ ఆడపిల్లలని..
“everything ok mam” అని నిలకడగా సమాధానం ఇచ్చారు ఆ ఇద్దరు ఆడపిల్లలు…
ఆ ఇద్దరు ఆడపిల్లలు, చదువులలో ఒకరికి ఒకరు పోటీ. K.S. లక్ష్మి కొంత గడసరి మాటకారి, తస్లీమా కొంత నెమ్మదస్తురాలు…
వాళ్ళు తెచ్చిన ప్రాజెక్ట్, పంటలకు శాస్త్రీయ పద్దతిలో నీటి పారుదల సంబంధించింది. అది శ్రీధర్ టీం లాగ కొత్త పరికరాన్ని డిజైన్ చేసిన ప్రాజెక్ట్ కాకపోయినా, ఒక నాలుగు చిన్న చిన్న చదరపు టబ్ ల్లో నిజమైన మట్టి , వరి వంగడాలను ఉంచి వాటికి నీరు అందేలా కొంత నీటి కనెక్షన్స్ ఉన్నాయి…వాళ్ళ వెనకాల…పెద్ద పెద్ద ఛార్ట్స్ పైన ఏవో కొన్ని స్కెచ్స్ ఉన్నాయి డెమో ఇవ్వడం కోసం…
కనీసం రెండు అడుగులు దూరం కూడా లేని పక్కపక్క స్టాల్స్ అవ్వడం వల్ల…సుబ్రమణ్యం, నిర్మలా ఒకరినొకరు పలకరించుకోకుండా తప్పలేదు…
“హలో సార్..how are you…” అంటూ సుబ్రహ్మణ్యం ని పలకరించింది నిర్మల కొంత కృత్రిమమైన నవ్వుతో…
“..fine..” అంటూ బదులిచ్చాడు సుబ్రమణ్యం…చిక్కని నవ్వుతో…పళ్ళ వరస అంతా కనిపించేలా…
“నాది పేరు నిర్మల…” అంటూ చేయ్యి చాపింది .. హ్యాండ్ షేక్ కోసం…
“నేను సుబ్రహ్మణ్యం” అంటూ తన రెండు చేతులతో చటుక్కున తన చెయ్యి అందుకుని …తెగ ఊపేస్తున్నాడు చేతిని సుబ్రహ్మణ్యం..
“మీ పిల్లలా ..?” అని అడిగింది నిర్మల …
“కాదు మేడం .. నా స్టూడెంట్స్…, వీడు శ్రీధర్,వాడు కిరణ్ … నాకు ఇంకా పెళ్లి కాలేదు ..” అన్నాడు సిగ్గుపడుతూ ఆమె చెయ్యి వదిలేస్తూ ..
దానికి నిర్మల “ohh sorry…I meant, are they your students..?.” అని పక్కున నవ్వేసి… “నాది తెలుగు very bad…కేరళ ముంచి వచ్చాను…కొంచెం కొంచెం తిప్పలు ఉన్నాయి…by the way వీళ్ళు నాది స్టూడెంట్స్ కొండా సుబ్బ లక్ష్మి , తస్లీమా ఖాన్..” అంది..
కొంత క్షణాల తర్వాత ఆమె ఏమి చెప్తుందో అర్థం చేసుకుని… “పర్లేదు మేడం … పక్కనే ఉంటారుగా… రెండు రోజుల్లో నేర్పించేస్తాను…” అంటూ కని కనిపించని మెలికలు తిరుగుతున్నాడు సుబ్రమణ్యం..
“thank you…సిటీ లో అందరూ నాది లాగానే మాట్లాడుతుంది..i will be happy if you teach me proper telugu…”… అంది నిర్మల తనకు వచ్చిన తెలుగులో నిజాయతీగా…
“ఖచ్చితంగా…నేను పని చేసేది ఇక్కడే… govt టీచర్ ని” అంటూ కొంత గర్వం ప్రదర్శిస్తూ … “పదండి మేడం… మనం తెలుగులో మాట్లాడుకుంటూ..మా తెలుగు స్కూల్ ని చూపిస్తాను అంటూ”… ఆమెను ఆహ్వానించాడు …
“తిప్పకుండా…” అంది నిర్మల … అది “తప్పకుండా..” అని అర్థం చేసుకున్నాడు సుబ్రహ్మణ్యం …
ఇద్దరూ వాళ్ళ స్టూడెంట్స్ ని అక్కడ వదిలేసి … బయలుదేరారు …
ఈ సంభాషణ అంతా చూస్తున్నారు శ్రీధర్ , కిరణ్ , సుబ్బలక్ష్మి , తస్లీమా…
“అసలేం జరుగుతుంది రా ఇక్కడ… నేను నిన్న చూసినా మెగాస్టార్ మాస్టర్ సినిమా మించిన సినిమా చూపించాడు మన సుబ్రమణ్యం మాస్టరు …” అన్నాడు కిరణ్ …
చిన్నగా నవ్వాడు శ్రీధర్ …
అటు పక్క.. ఆ ఇద్దరు అమ్మాయిలు ఏదో చెవులు కొరుక్కుని … పక పకా నవ్వుతున్నారు…
ఇంతలో..కిరణ్ కి ఎదో గుర్తుకొచ్చింది…అసలే కొన్ని నిమిషాల క్రితం…ఇంగ్లీష్ లో పద్యం పాడి వెటకారంగా సమాధానం ఇచ్చిన K.S. లక్ష్మీ గుర్తుకొచ్చింది…
తన అసలు పేరు కొండా సుబ్బలక్ష్మి అని … తనకి ఆలా పిలిపించుకోవడం ఇష్టం లేకనే తన పేరు K.S. లక్ష్మీ గా చెప్పుకుందని తన సినిమా తెలివితేటలతో గ్రహించాడు…
ఇక ఇదే అదనుగా…తనని పదే పదే “కొండా సుబ్బలక్ష్మి గారు” అని పిలిచి ఆటపట్టించడం మొదలుపెట్టాడు…
కొంత అసహనం తో…కక్కలేక..మింగలేక ఉన్న సుబ్బలక్ష్మి…తిరిగి ఏడిపించడానికి సమయం కోసం వేచి చూస్తుంది…