Comedy, Science Fair, Series, Stories

సైన్స్ ఫెయిర్ – Part 3

సోమవారం ఉదయం 8:00

శ్రీధర్, కిరణ్ తమ ప్రాజెక్ట్ మోడల్ పట్టుకుని … స్కూల్ తరగతులన్నీ తిరుగుతున్నారు… 

ప్రతి గదిలో .. వరుసగా బల్లలు పరిచి ఉన్నాయి … ప్రతి బల్ల పైన .. ఎవరివో పేర్లు వ్రాసివున్నాయి … 

వీళ్ళ పేర్లు … ఎక్కడా కనపడలేదు … వాళ్ళ మాస్టారు సుబ్రహ్మణ్యం లాగ … 

చివరికి … ఒక గది బయట “Agriculture & Water resources” అని ఎదో అంటించి ఉంది … 

“ఇది ఖచ్చితంగా మనం చేసిన ప్రాజెక్ట్ కి సంబంధించింది కాదు పద ఇంకో వైపు వెతుకుదాం” అన్నాడు శ్రీధర్ … 

“సరే కానీ ..ముందు ఈ బరువుని ఎక్కడన్న దించి… ఒక రెండు నిమిషాలు రెస్ట్ తీసుకుందాం … పద అంటూ ఆ గదిలోకి వెళ్ళి ఒక బల్ల మీద తమ సామాను పెట్టి… హమ్మయ్య అనుకున్నారు”… 

కిరణ్ అక్కడే నేల మీద కూలబడ్డాడు … శ్రీధర్ ఆ బల్ల వెనకాల ఉన్న కుర్చీ లో కూర్చున్నాడు … 

కొంచెం సేపు సేద తీరాక … శ్రీధర్ తన ముందు ఉన్న బల్ల పైన బోర్లా పడి ఉన్న పేపర్ ని అందుకున్నాడు … 

ఆ పేపర్ లో శ్రీధర్ , కిరణ్ Z.P Boys High School అని వ్రాసి ఉంది … 

“అరేయ్ కిరణ్…” అని గట్టిగా కేక వేసాడు శ్రీధర్ … “మన స్టాల్ ఇదేరా” అంటూ ..  

“ఇదేంట్రా శ్రీధర్…ఒక బల్ల వేసి..దానికి స్టాల్ అంటారు…ఇది టేబుల్ కదా…”

“ఏదోకటి..ముందు..సహాయం చెయ్యి…ఈ ప్రాజెక్ట్ అసెంబుల్ చేయడానికి… ”

ఇద్దరు కలిసి 10 నిమిషాల్లో ఆ పరికరాన్ని బిగించి … బయటికి వెళ్లారు .. 

ఆ జిల్లా లోని వివిధ ప్రాంతాల నుంచి అనేక బస్సులు … అందులోంచి ఒక్కొక్కరు చేతుల్లో ఏవేవో పరికరాలని మోసుకుని దిగుతున్నారు…

కిరణ్ కి ఇదేమి పట్టట్లేదు…కానీ శ్రీధర్ లో ఎక్కడో కొంత బెరుకుతనం మొదలైంది ఆ హడావిడి చూసి .. 

“ఏమయిందిరా .. అలా బిగుసుకుపోయి చూస్తున్నావ్ “ అన్నాడు కిరణ్… 

“ఈ హడావిడి అంతా చూస్తుంటే … కొంచెం భయంగా ఉందిరా …”

“సైన్స్ లో మార్కులు అడగరు అంటే అదే చాలు రా… అంతకు మించి నాకే భయం లేదు … అయినా బాగా చదివే నువ్వు భయపడి…ఏమి రాని నేను భయపడి … ఇంకెందుకురా ఈ చదువులూ ..?

సర్లే.. పద లోపలికి వెళదాం … ఈ జనాలని చూస్తుంటే అలాగే ఉంటది …”

అని ఇద్దరు లోపలికి ..తమ స్టాల్ దెగ్గరికి నడిచారు … 

కొంత దూరం లో ఉన్నారు తమ స్టాల్ చేరుకోడానికి … 

అంతలో ఎదో లీలగా… రెండు యూనిఫార్మ్స్ వేసుకున్న వ్యక్తులు తమ స్టాల్ దెగ్గర తచ్చారుడుతూ ఎదో కదిలిస్తున్నారు  చేస్తున్నారు … 

శ్రీధర్ అది దూరం నుంచే చూసి … కిరణ్ కి చెప్పాడు … 

ఇద్దరు అరుచుకుంటూ తమ స్టాల్ దగ్గరకు చేరుకున్నారు … 

అది ఇద్దరు అమ్మాయలు … తెలుపు బులుగు యూనిఫార్మ్ వేసుకుని…షూస్, బెల్ట్, బ్యాడ్జి, రిబ్బన్ తో కట్టిన రెండు జడలు లాంటి హంగామాతో సిటీ కాన్వెంట్ పిల్లల్లా కనిపిస్తున్నారు … పైగా అందులో ఒక అమ్మాయికి … కళ్ళజోడు … 

“మా స్టాల్ దగ్గర ఎం చేస్తున్నారు ..” అంటూ లేని గంభీరత్వంతో అడిగాడు కిరణ్ … 

దానికి బదులుగా ఆ కళ్ళజోడు పెట్టుకున్న అమ్మాయి .. “actually my project needed electricity, there is only one socket here, so i am looking for another way…” అంటూ ఇంగ్లీష్ లో గడగడా పద్యం పాడేసింది … 

శ్రీధర్, కిరణ్ లు ఇద్దరు తెల్లమొఖాలేసుకుని చూస్తున్నారు… 

అసలుకే కొంత బెరుకుతనం తో శ్రీధర్ … ఆ ఇంగ్లీష్ ప్రవాహానికి … ఇంకా ఆత్మనూన్యతా భావం లోకి వెళ్ళిపోయాడు … 

కొంత తేరుకున్న కిరణ్ … “ఇది తెలుగు మీడియం స్కూల్ … ఈ కాంపౌండ్ లో తెలుగులోనే మాట్లాడాలని మా తెలుగు సార్ స్ట్రిక్ట్ గా చెప్పాడు …ఇంతకీ మీరెవరు ..?” అని గాంభీర్యం నటిస్తూ అన్నాడు .. 

దానికి… ఆ కళ్ళజోడు పెట్టుకున్న అమ్మాయి కొంచెం వెటకారం గా నవ్వి … “నా పేరు K.S. లక్ష్మి … ఇది నా ఫ్రెండ్ తస్లీమా …మాది సిటీలో ఉన్న Masters Techno School…మాది మీ పక్కనే వున్న స్టాల్…ఇక్కడ ఎలక్ట్రిక్ సాకెట్ ఒక్కటే ఉంది…కాబట్టి ఇద్దరం షేర్ చేసుకోవాలి….”

తానూ అంత ఆత్మవిస్వాసం తో హెచ్చరించినట్లు మాట్లాడేసరికి…శ్రీధర్ , కిరణ్ తల ఆడించడం తప్ప మారు మాట్లాడలేదు …  

ఇంతలో…ఒక పక్క నుంచి సుబ్రహ్మణ్యం…మరోపక్క నుంచి ఆ కాన్వెంట్ అమ్మాయిల టీచర్ నిర్మల…రావడం తో..ఎవరి స్టాల్ల్స్ లోకి వాళ్ళు వెళ్లారు…

Tagged , ,