Comedy, Science Fair, Series, Stories

సైన్స్ ఫెయిర్ – Part 2

సాయంత్రం 5:00

ఆఖరి స్కూల్ గంట కొట్టారు…

ఎవరికి వాళ్లు  బాగ్ సర్దుకుని… బయటికి నడిచారు … 

చివరికి … శ్రీధర్ , కిరణ్ … మిగిలారు ఆ గది లో … ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ … 

ఒక పదినిమిషాల తర్వాత .. సుబ్రమణ్యం క్లాస్ లోకి వచ్చాడు …

“ఎరా!!… రెడీ నా మీరిద్దరూ …”

ఇద్దరు ముఖాల్లో అస్పష్ఠథ … 

“రెడీ నే ..సర్ .. కానీ అసలు ఏమి చెయ్యాలి ..?”

“సరే ..మీకు వివరంగా చెప్తాను వినండి ..”

మనం రేపు, ఎల్లుండి..ఇంకా అవసరం అయితే ఆదివారం కూడా…కష్టపడి…ఒక సైన్స్ ప్రాజెక్ట్ చేయబోతున్నాం…దాన్ని సైన్స్ ఫెయిర్ లో ప్రదర్శించ బోతున్నాం …దాని గురించి అక్కడికి వచ్చే వాళ్ళకి … మనం వివరంగా డెమో (demo)  చేసి చూపించాల్సి ఉంటుంది …

మనకి ఒక స్టాల్ ఇస్తారు అక్కడికి వచ్చిన జనాలకి మన ప్రాజెక్ట్ డెమో ఇవ్వాలి…అలాగే మన లాగ వచ్చిన వాళ్ళకి కూడా స్టాల్ ఉంటుంది… 

“ఏంటి స్టూల్ మీద చెప్పాలా?” అన్నాడు కిరణ్ 

“స్టూల్ కాదురా వెదవ … స్టాల్” అని కసురుకున్నాడు సుబ్రహ్మణ్యం 

ఇంక మారు మాట్లాడలేదు కిరణ్ … తనకు అదేంటో అర్థం కాకపోయినా.. 

సుబ్రహ్మణ్యం చెప్పడం కొనసాగించాడు … 

అక్కడికి మొదటిరోజు కొంతమంది గవర్నమెంట్ ఇంజనీర్స్, జనవిజ్ఞానవేదిక నుంచి కొంత మంది వస్తారు … వాళ్ళకి మనం ప్రెసెంటేషన్ ఇవ్వాలి … 

రెండో రోజు లోకల్ MLA, జిల్లా కలెక్టర్ వస్తారు … వాళ్ళకి కూడా మన ప్రెసెంటేషన్ ఇవ్వాలి … వీళ్లతో పాటు కొంత మంది పత్రికా విలేకరులు కూడా వస్తారు కెమెరా పట్టుకుని … 

మనలా వచ్చిన వాళ్ళందరూ నుంచి …ప్రాజెక్ట్ & ప్రెసెంటేషన్ ఆధారంగా కొంత మందిని సెలెక్ట్ చేసి.. అవార్డ్స్ సర్టిఫికెట్స్ ఇస్తారు … అంతే కాదు తర్వాత జరగబోయే రాష్ట్ర స్థాయి సైన్స్ ఫెయిర్ కి పంపుతారు … 

“దాని వల్ల ఉపయోగం ఏంది సార్” అన్నాడు కిరణ్ … 

సుబ్రహ్మణ్యం .. చిరాకుగా “బాగుపడాలనుకునే వాడికి ఉపయోగం రా … నీలా చెడిపోయేవాళ్ళకి ఎలాంటి ఉపాయాగం లేదు”

కిరణ్ పైకి భయం తో కూడిన గౌరవాన్ని నటిస్తూ … “సరే సార్ …” అని పైకి అని .. మనసులో “జీతం సరిపొవట్లేదేమో ఈ మధ్య కోపంగా ఉంటున్నాడు “ అనుకున్నాడు …  

ఇంతలో  శ్రీధర్, “దేని గురించి చేద్దాం సార్ ప్రాజెక్ట్?”

పక్కనుంచి …కిరణ్ “ఆదిత్య 369 లాంటిదా సార్ ?”

“శ్రీధర్, ఈ వాగుడుకాయ తప్ప నీకెవరు దొరకలేదా క్లాసులో” అన్నాడు సుబ్రహ్మణ్యం

ఇంత గొప్ప ఐడియా ఇస్తే ఎందుకిలా అంటున్నారు అని చిన్నబుచ్చుకున్నాడు కిరణ్ మనసులో .. 

“అరె శ్రీధర్…నీకు దేని గురించి చెయ్యాలని వుంది…? ఏదయినా మనసులో ఉంటే చెప్పు…నాకు తెలిసిన పరిజ్ఞానం లో  దాన్ని ఎలా చేయాలో చెప్తాను…” అన్నాడు సుబ్రమణ్యం… 

దానికి బదులుగా శ్రీధర్ “క్రిందటి సంవత్సరం మన పక్క జిల్లా లో  రాళ్ళపాడు  రిజర్వాయర్ గేట్లు తెగి ఎంతో ప్రాణ నష్టం జరిగింది కదా .. మనం దాని మీద ప్రాజెక్ట్ చేద్దాం సార్” అన్నాడు.. 

 “సరే…నేను వార్తల్లో చదివినదానికి కొంత నా సైన్స్ పరిజ్ఞానమ్ జతకలిపి .. అలాంటి విపత్తు ని ఎలా నివారించాలో అని ఒక మోడల్ తయారుచేస్తాను … మీరు ఈ రెండు రోజులు నేను చెప్పినట్టు చెయ్యాలి … 

ఆ తర్వాత దీనిని ఎలా ప్రెసెంటేషన్ చేయాలో నేర్పుతాను … సరేనా” అన్నాడు సుబ్రమణ్యం ..

సరే అని తల ఊపారు ఇద్దరూ …

“సార్.. మరి ఎవరైనా ఏదైనా ప్రశ్నలు అడిగితే …?” అని అడిగాడు శ్రీధర్ … 

“నువ్వు సరిగ్గా ఈ ప్రాజెక్ట్ మోడల్ ని అర్థం చేసుకుంటే … నువ్వు కచ్చితంగా చెప్పగలవు శ్రీధర్ “ అన్నాడు సుబ్రహ్మణ్యం 

“మరి ఎవరైనా .. అధిక ప్రశ్నలు అడిగితే …?” అన్నాడు కిరణ్ … 

“అధిక ప్రసంగివి నువ్వు ఉన్నావు కదా … ఆ మాత్రం చూసుకోలేవూ” అని ఠక్కున బదులిచ్చాడు సుబ్రహ్మణ్యం 

ఇక ముగ్గురూ కలిసి ఆ మూడు రోజులు కష్టపడి …తమ ప్రాజెక్ట్ రెడీ చేశారు … 

Tagged , ,