horror

తాటిచెట్టు

అది 1990  ఆగస్ట్ నెల,   తాటిచెట్లపాలెం అనే చిన్నపల్లెటూరు. ఊరు పేరుకు తగ్గట్టే , ఆ ఊరు లో తాటి చెట్లు ఎక్కువ. ఆ వూరిలో మస్తాన్ అనే ఒక రోజువారీ కూలి ఉండేవాడు. మస్తాన్ సంవత్సరం క్రితం వరకూ ఆ ఊర్లోనే సర్పంచ్ దగ్గర పని చేసేవాడు, కానీ కొన్ని కారణాల వళ్ల ఆ పని మానేసి, పక్కనున్న టౌన్ కు వెళ్ళి కూలి పని చేస్తున్నాడు. ప్రతి రోజు సైకిల్ ఫై పక్కనే  వున్న టౌన్ లోకి వెళ్లి సాయంత్రం వరకు కూలి పనులు చేసుకుని, సాయంత్రానికి టౌన్ లో ఏదో ఒక సారా దుకాణం లో తాగి, మళ్ళి తన వూరికి సైకిల్ పైనే వచ్చేస్తుంటాడు. వాళ్ళ ఊరి నుంచి టౌన్ కి 15 కిలోమీటర్ లు దూరం , సుమారుగా గంటా , గంటన్నర లో తన తోటి వాళ్ళతో కలిసి రాత్రి 8 కల్లా వూర్లో వున్నా ఇంటికి వచ్చేవాడు. 

ఒకరోజు ఎప్పటిలాగే, మస్తాన్ ప్రొద్దున్నేలేచి,  పని కోసం టౌన్ కి వెళ్ళాడు. ఆ రోజు పని ఎక్కువ ఉండి, కూలి డబ్బులు ఇచ్చేవాళ్ళు ఆలస్యంచేసేసరికి , సారా దుకాణానికి చేరేసరికి బాగా  ఆలస్యం అయింది. అంతా ముగిన్చుకుని, వూరికి బయలుదేరేసరికి ..బాగా చీకటి పడింది. రోజు తనతో పాటు తోడుగా వచ్చేఊరివాళ్లూ  వెళ్లిపోయారు. సారా నిషా బాగా తలకెక్కి , ఊరుకి బయలుదేరాడు సైకిల్  తోక్కుకుంటూ ఒక్కడే. 

పోయే దారిలో అంతటా గతుకులు,  కుడి వైపున వరుసగా తాటి చెట్లు, ఎడమ వైపున  పెద్ద పంట కాలువు. తాటి చెట్లు చల్ల గాలికి నెమ్మదిగా కదులుతూ తాటాకు చప్పులు చేస్తున్నాయ్ , పంట కాలువ వెన్నల్లో మెరిసిపోతూ మినుకు మిణుకుమంటుంది. కీచు రాళ్ళ కీచు కీచు అరుపులు , గుడ్ల గూబ కూతలు , అప్పడప్పుడు నక్క ఊళలు తో  దారి మొత్తం నిర్మాణుష్యంగా వుంది. ఆ దారి లో సన్నగా పాటలు పాడుకుంటూ , గతుకుల దారిలో గడ గడ మంటూ సైకిల్ సంగీతంతో  వూరికి తిరుగు ప్రయాణం మొదలయింది. కొంత దూరం పోయాక , సగం దూరం చేరుకోగానే,  ఘర..గరా మని సైకిల్ నుంచి శబ్దం, దాదాపు కిందపడినంత పనయింది .. తేరుకుని పైకి లేచి ఎందుకు పడ్డానా అని సైకిల్ ని చూసాడు . సైకిల్ చైన్ పక్కకి తొలగి వుంది. ఆ మత్తు లోనే సైకిల్ చైన్నిఅటు ఇటు తిప్పి ఎదోవిధంగా సరి  చేయటానికి  ప్రయతిస్తున్నాడు. 

అంతలో , తన వెనకాల ఏదో అలికిడి అయింది , తిరిగి చూసాడు, ఎవరు లేరు , మళ్ళి తన ప్రయత్నం కొనసాగిస్తున్నాడు సైకిల్ తో … మళ్ళి ఇంకో అలికిడి తిరిగి చూసాడు …మళ్ళి ఎవరు లేరు … ఇంతలో సైకిల్ చైన్ కుదురుకుంది, ఇక ప్రయాణం కొనసాగించాలని  పైకి లేచాడు … ఎవరో.. తన వెనకాల ఉన్నట్టు అనిపించింది.. అదీ చాలా దెగ్గరగా ఉన్నటు అనిపించింది … నెమ్మదిగా తలా తిప్పి చూసాడు ..మళ్ళి ఎవరు లేరు .. కానీ ఏదో తెల్లటి పొగ … కొంత సేపటికి ఆ పరిసరం అంతా వ్యాపించేసింది ఆ తెల్లని పొగ. కళ్ళు కనిపించుటంలేదు ఆ పొగలో.. సైకిల్ పట్టుకుని … కొంత దూరం నడుచుకుంటూ వచ్చాడు ఆ పొగ ని తప్పించుకోవడానికి … కానీ ఏ  దిక్కు వెళుతున్నాడో తెలియలేదు మస్తాన్ కి … 

కొంత దూరం వచ్చాక … పొగ కొంచెం కొంచెం గా తగ్గుతుంది … పొగ వల్ల కళ్ళు నీళ్లు కారుతున్నాయి… చూపు సరిగా కనపడట్లేదు … కొంత తేరుకున్నాక, ఎదురు గా దారి కనపడింది.. కుడి వైపు తాటి చెట్ల వరుస ..ఎడమ వైపు పంట కాలువ ఉండడం తో ..  ఇది తన ఊరి వైపే అని నిర్దారించుకున్నాడు  ..ఇక తొందరగా బయలుదేరుదాం అనుకుంటూ .. ఎదో కదులుతున్నట్లు ఉంటే, ఒక్క సారి కొంచెం పైకి చూసాడు … ఆ దృశ్యం చూసి , తానూ ఏమి చూస్తున్నానో  అర్థం కానీ స్థితి లో వుండిపోయాడు .. 

కుడి వైపు తాటి చెట్టు పైన.. ఒక తెల్ల్లటి ఆకారం, స్త్రీ రూపం, తెల్లని చీరలో , జుట్టు విరబోసుకుని వేలాడుతుంది .. ఎడమ చేయి , కాలుని చెట్టుకు అదనుగా పెట్టి,  కుడి కాలు, చేయిని గాలిలో అలా వదిలేసి …చెట్టు పైన వేలాడుతుంది… వెన్నెలకి ఆ ఆకారం ఇంకా ఎక్కువ ప్రకాశిస్తూవుంది ..కళ్ళు ఎర్రగా కనిపిస్తున్నాయి .. ఆ ఆకారం బరువుకి ..చెట్టు ఇంకొంచెం ఎక్కువ ఊగుతుంది. ఆ నిశ్శబ్దం లో , ఆ ఊగుతూన్న చెట్టు , ఆ ఆకారం ఎంతో భయంకరంగా వుంది .. 

అకస్మాత్తు గా ఆ ఆకారం దబ్బుమని పై నుంచికిందకి దూకి తనకి ఎదురుగా వచ్చింది. ఇదంతా నిస్చేష్ఠుడుగా  చూస్తున్న మస్తాన్  అది దెయ్యం అని ఒక అంచనా కి వచ్చాడు. ఆ దెయ్యానికి తనకు మధ్య ఒక 50 అడుగుల దూరం మాత్రమే వుంది. కంగారుపడిన మస్తాన్, సైకిల్ వెనక్కితిప్పి తొక్కడం ఆరంభించాడు..అప్రయత్నంగా టౌన్ వైపు .. 

అలా తానూ  సైకిల్ టౌన్ వైపు కు త్రిప్పి తొక్కేకొద్దీ …తనకి తెలియకుండా దిక్కులు తారుమారవుతున్నాయి.. 

ఎడమ వైపు వుండవలిసిన తాటి చెట్లు కుడి వైపుకి .. కుడి వైపున ఉండాల్సిన పంట కాలువ ఎడమ వైపుకి .. మారిపోతున్నాయి . 

అలా దిక్కులు మారిపోయి …తాను ఎక్కడ నుంచి పారిపోయాడో …మళ్ళీ అక్కడే ఆగాడు…ఆ దెయ్యానికి ఎదురుగ…

మళ్ళీ సైకిల్ వెన్నక్కి తిప్పి పరుగు అందుకున్నాడు…తనకి తెలియకుండానే…  మళ్ళీ దిక్కులు మారి పోయి … మళ్ళీ ఎక్కడ నుంచి పారిపోయాడో అక్కడికే వస్తున్నాడు.

ఇలా కొంతసేపు ఐయ్యింది…కానీ మస్తాన్ తన మానవ ప్రయత్నం చేస్తూనే వున్నాడు, తప్పించుకోటానికి. 

అకస్మాత్తుగా తన సైకిల్ బరువెక్కి కదలనంటుంది, ఎవరో10 మంది సైకిల్ వెనుక కూర్చున్నట్లు  వుంది …. మస్తాన్, అతి భారం గా తొక్కుతున్నాడు.. సైకిల్ చాలా నీరసం గా నెమ్మదిగా కదులుతుంది … 

ఇంతలో తన వెనుక వైపు నుంచి …తన భుజాల మీదుగా.. రెండు  చేతులు … సన్నటి పొడుగాటి వేళ్ళు , పదునైన గోర్లతో తన చాతి పైన .. గట్టిగా రక్కుతున్నాయి .. అలా ఆ చేతులు ఒక్కసారిగా  తన మెడ పట్టుకుని గట్టిగ నొక్కడం మొదలైంది . తను కింద పడిపోయి పెనుగులాడుతున్నాడు. ఆ దెయ్యం తన గుండెల మీద కూర్చుని , అతని మెడ ని గట్టిగా నులుముతుంది … ఈ పెనుగులాటలో ఆ దెయ్యం ని దెగ్గర గా చూసాడు..  ఎక్కడో చూసినట్లు కొన్ని జ్ఞాపకాలు వస్తున్నాయి . .

ఇంతలో దూరంగా రెండు లైట్లు శబ్దం చేసుకుంటూ దెగ్గరగా వస్తున్నట్లు కనిపించింది … అది ఒక అంబాసిడర్ కారు … ఆ వూరు సర్పంచ్ ది. అతని పేరు రంగారావు. అతను పెద్ద ఆసామి కూడా ఆ ఊర్లో. మస్తాన్ సంవత్సరం క్రితం వరుకూ అతనిదెగ్గరే పనిచేసేవాడు.

ఆ కారు, దెగ్గరికి రావడం తో, ఈ దెయ్యం అదృశ్యం అయ్యింది.

కారు వచ్చి…మస్తాన్ ముందు ఆగింది. కారు అద్దం దించుతూ (తన కుడి చేతిని గుండ్రం గా తిప్పుతూ కారు అద్దాన్ని దించడం కోసం), రంగారావు… 

“ఎరా, ఎంజాస్తున్నావు ఈడ, ఇంత రాత్రి”

మస్తాన్ వణుకుతున్నస్వరంతో…

“అయ్యగారు, దె దె  దెయ్యం … దెయ్యం అండీ , నన్ను మీ బండిలో ఎక్కించుకుని వూర్లో దిగబెట్టండి దయచేసి..లేకుంటే..నన్నుచంపేసేలా వుంది ఈ దెయ్యం“

రంగారావు విసుగ్గా…

“ఎం వాగుతున్నవురా,  చెత్త నా కొడకా, తాగి నాటకాలాడుతున్నావా, నీ బ్రతుక్కి నువ్వు నా కారు ఎక్కుతావా, దెయ్యం లేదు గీయం లేదు.. నీ చావు నువ్వు చావు ”

అని విసురుగా కారు ని ముందుకు పోనిచ్చాడు…

కారు కొన్ని అడుగుల దూరంపోయాక, కంటి రెప్పపాటులో ఒక పెద్ద శబ్దం… 

ఒక తాటి చెట్టు వేర్ల తో సహా ధడేల్ మని కారు పైన పడింది. కారు నుజ్జు నుజ్జు అయింది.. రంగారావు తీవ్రగాయాలతో కారు డోరు తెరుచుకుని , క్రింద పడి పాకు తూ బయటికి వస్తున్నాడు…

తన శక్తి నంతా కూడ దీసుకుని, లేచి నిలబడ్డాడు..అంతలో అదృశ్యమైన దెయ్యం, రంగారావు ముందు, ప్రత్యక్షమైంది. రంగారావులో  ఎదో భయం , ఆశ్చర్యం లో ఏదో చెప్పబోతున్నాడు…ఇంతలో..దెయ్యం రంగారావు చాతి పైన బలంగా ఒక్క గుద్దు గుద్ది…తన గుండెని బయటికి లాగేసింధి…రంగారావు గుండె దెయ్యం చేతిలో కాసేపు కొట్టుకుని ఆగిపోయింది…

ఇంత భీభత్సం చూసిన మస్తాన్…అక్కడే స్పృహ తప్పిపడిపోయాడు…

కొన్ని గంటల తరువాత … 

తెల్లవారుతుంది…మస్తాన్  స్పృహ లో నుంచి బయటికి వస్తున్నాడు…ఒక్కసారిగా..ఏమిజరిగిందో గుర్తుకు తెచ్చుకుని ..ఉలిక్కిపడి లేచి నుంచున్నాడు …తన ముందు రంగారావు మృతదేహం, కొంచెం దూరం లో రంగారావు గుండె…ఇంకో పక్క  నుజ్జు నుజ్జు అయిన కారు దాని పైన పడివున్న తాటిచెట్టు…దృశ్యం భయంకరంగా వుంది… దెయ్యం జాడ కనిపించలేదు, చుట్టూ చూసాడు, తల ఎత్తి తాటిచెట్ల పైనా చూసాడు…ఎక్కడా దెయ్యం జాడ లేదు…ఇంక ఇదే అదును అనుకుని…ఊరికి పరుగు అందుకున్నాడు…సైకిల్ ఉన్నదన్నవిషాయాన్నికూడా మర్చిపోయి…ప్రాణాలు అర చేతిలో పెట్టుకుని ఊరి వైపు పరుగు పెట్టాడు.

ఆఖరికి ఇల్లు చేరుకున్నాడు, గబగబా ఇంట్లోకి వెళ్లి, తలుపులు వేసుకుని, గొళ్ళెంపెట్టుకుని …అక్కడే కూలబడ్డాడు…బిగ్గరగా ఏడుస్తూ…భయంతో వణుకుతూ…అసలు ఏమి జరిగిందో గుర్తు చేసుకుంటున్నాడు…

తనకి మెడ, చాతి దెగ్గర నెప్పితో మండుతుంది…అద్దం  దెగ్గరికి వెళ్లి చూసుకున్నాడు…చాతి పైన గాట్లు, మెడ పైన వేళ్ళతో నొక్కి కమిలిన  చారలు వున్నాయి…ఒక్కసారి ఆ ఘట్టాన్నిమల్లి గుర్తుచేసుకున్నాడు..ఆ దెయ్యం లో ఎవరో తెలిసినవాళ్ళ పోలికలు వున్నాయి అని గుర్తు చేసుకున్నాడు. 

అంతలో ఏదో గుర్తుకువచ్చింది, ఆ దెయ్యం ఎవరోకాదు చనిపోయిన సర్పంచ్ భార్యా , సరిగ్గా సంవత్సరం క్రితం, సర్పంచ్ తన భార్య ని చంపేశాడు.తన సర్పంచ్ పదవి కోసం ఒక దిగువ కులం యువతి ని పెళ్లి చేసుకుని , పదవి వచ్చాక ఆమెను హత్య చేసాడు.   మస్తాన్ అప్పట్లో సర్పంచ్ దెగ్గర పనిచేసేవాడు కనుక  ఆ శవాన్ని ఎవ్వరికి కనపడకుండా తన ఇంట్లొనె  పూడ్చిపెట్టాడు. 

ఇలా తన ఆలోచనల్లో వున్న మస్తాన్ కి  తన ఎదురుగా వున్నఅద్దం లోనుంచి  అకస్మాత్తుగ ఒక చేయి బయటకి వచ్చి…మస్తాన్  మెడ పట్టుకుంది…ఈ సారి మస్తాన్ తప్పించుకోలేకపోయాడు.

Tagged , ,